ఈ వజ్రాల వేలం...వేస్తుంది మన మనస్సుకు గాలం

updated: February 18, 2018 17:52 IST

మన జీవిత కాలంలో ఎప్పుడూ వినని,చూడనంత విలువలకు వేలంలో వజ్రాలు అమ్ముడు అవుతున్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల ఈ వేలాలు జరుగుతున్నాయి. వీటి విలువ కేవలం అవి వేలంలో అమ్ముడయినప్పుడే మాత్రమే నిర్ణయించబడతాయి. అప్పుడే వీటి సరైన విలువ బయిటకు వస్తుంది. అంటే ఏ రేంజి క్రేజ్ ఆ వజ్రానికి ఉంటుందో..అదే దాని రేటుని నిర్ణయిస్తుందన్నమాట.  

ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్స్ మాదిరిగానే ఈ వజ్రాలు కూడా వాటిని సేకరించేవారిలో ఉన్న ఆసక్తిపై విలువ ఆధారపడి ఉంటుంది. అయితే ఇలా వజ్రాలపై ఊహకు అందని మొత్తాలు పెట్టే ధనికులు ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో వజ్రాలు వేట కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఫలానా వజ్రం  తమ దగ్గర ఉంది అని చెప్పుకోవటమే ఓ స్దాయికి వెళ్లినవారికి కీర్తి, దాని ద్వారా ఆనందం కలుగుదాయంటున్నారు వేలం నిర్వాహకులు. అలాంటి విలువైన వజ్రాలులో కొన్ని ఇక్కడ చూడవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే వజ్రాలలో గులాబీ (పింక్) వర్ణం వజ్రం కూడా ఒకటి. అలాంటిదే ఓ అరుదైన గులాబీ రంగు వర్ణం కలిగిన వజ్రపు ఉంగరానికి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో  వేలం నిర్వహిచారు. 24.78 క్యారెట్ల బరువు ఉండే ఈ వజ్రం వేలంలో 3.8 కోట్ల అమెరికా డాలర్ల ధర పలికింది.

గతంలో పశ్చిమ ఆఫ్రికాలోని సియారా లియోన్ దేశంలో 706 క్యారెట్ల భారీ వజ్రం లభించింది. వజ్రాలు అధికంగా లభించే కోనో ప్రాంతంలో క్రిస్టియన్ పాస్టర్‌గా పని చేస్తున్న ఇమానుయేల్ మోమోహ్ అనే అతనికి ఈ వజ్రం లభించింది. ఇమానుయేల్ ఈ వజ్రాన్ని దేశాధ్యక్షుడు డాక్టర్ ఎర్నెస్ట్ బాయ్ కొరోమోనోకు బహూకరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. 

అలాగే తెలంగాణకు చెందిన ఓ అరుదైన డైమండ్ వేలంలో భారీ రేటు పలికి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. 19.07 క్యారెట్ల ఈ వజ్రం వేలంలో ఏకంగా 14.5 మిలియన్ యూఎస్ డాలర్లు పలికింది. ‘గ్రాండ్ మాజరిన్’గా పిలిచే ఈ డైమండ్ తెలంగాణకు చెందిన కోహినూర్ రకానికి చెందిందని జెనీవాలో వేలం వేసిన నిర్వాహకులు తెలిపారు. 

 ఇక  ‘ది క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’ అమెరికాలో ఆర్కన్సాస్ రాష్ట్రంలోని ముర్‌ఫ్రీస్ ఐరోలో ఈ గని ఉంది. సందర్శకులు ఈ గనిలోకి వెళ్లి వజ్రాల కోసం వెదికి ఎవరికి దొరికినవి వారు వెంట తీసుకెళ్లచ్చు. పార్క్ అధికార లెక్కల ప్రకారం సందర్శకులు ఏటా సగటున 600 వజ్రాలు కనుగొని తీసుకెళ్తున్నారు. అవన్నీ అనేక రంగులు, గ్రేడ్స్‌కి చెందిన వజ్రాలు.

comments